Tuesday 3 April 2012

మ్యాథ్స్ పేపర్ -2 కు 4 మార్కులు కలిపే యోచన

 నిన్నటి ఎస్‌ఎస్‌సీ మ్యాథ్స్ పేపర్ తప్పిదాలపై ప్రభుత్వం స్పందించింది.
దానిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా
తప్పుల వల్ల విద్యార్థులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటారు. 4 మార్కులు
కలిపే యోచనలో అధికారులు ఉన్నారు.

  • నాలుగు వారాల్లో నివేదికివ్వండి
  • ప్రభుత్వ స్కూళ్లపై కేంద్రానికి సుప్రీం ఆదేశం
  • విద్యాహక్కును నీరుగారుస్తున్నారని పిల్‌
  • రాష్ట్రంలోనూ ఇదే దుస్థితి
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయో వివరాలు తెలియచేయాలని సుప్రీం కోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు నాలుగు వారాల గడువిచ్చింది. ప్రభుత్వ పాఠశా లల్లో పెద్ద సంఖ్యలో ఖాళీగా పడివుంటున్న పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ పిటిషన్‌ దాఖలైన నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎక్కువమంది విద్యార్థులు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారైనందునే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఖాళీలను భర్తీ చేయడంలేదని పిటిషనర్‌ ఆరోపించారు. అధికార యంత్రాంగం ఇలా ఉదాసీనంగా వ్యవహరించడమంటే పిల్లల ప్రాథమిక హక్కు అయిన విద్యా హక్కును నిరాకరించడమే కాగలదని పిటిషన్లో పేర్కొన్నారు. విద్యా హక్కు రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద హామీ కల్పించిన జీవించే హక్కులోని అంతర్భాగమేనని గుర్తు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు దీనిపై తగు వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ఉదాసీనతకు ప్రభుత్వ పాఠశాలలు బలిపశు వులవుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ప్రగాఢంగా వుంది. కేవలం అన్‌ ఎయిడెడ్‌, ప్రయివేటు పాఠశాలల ప్రయోజనాలను ప్రోత్సహించడం కోసమే ఈ రకంగా వ్యవహరిస్తున్నారన్న విషయయూ అందరికీ తెలిసిందే.
రాష్ట్రంలో అంతంతమాత్రమే
విద్యా హక్కు చట్టం వచ్చి రెండేళ్లు పూర్తయినా రాష్ట్రంలో దాని అమలు అంతంతమాత్రంగానే ఉంది. ఈ చట్టం ప్రకారం రాష్ట్రంలో 38,355 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. కాని ఈ రెండేళ్లలో ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదని తెలుస్తోంది. దీనికి ప్రత్యేకంగా డిఎస్సీ ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని చట్టం చెబుతోంది. ఫర్నిచర్‌, పరిశుభ్రమైన మంచినీరు, పాఠశాలకు ప్రహారీ గోడలు, విద్యుత్తు సౌకర్యం...ఇలాంటివన్నీ తప్పనిసరిగా ఉండాలి. కాని రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలలు ఈ సౌకర్యాలకు నోచుకోలేదు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో అర్హత లేని ఉపాధ్యాయులను నియమించ కూడదన్న నిబంధనలను తుంగలో తొక్కారు. పిల్లలకు నోట్స్‌ బుక్స్‌ అరకొరగా ఇస్తున్నారు. గతేడాది ఏ పాఠశాలల్లో కూడా చట్టం అమలు జరిగిన దాఖలు లేవు. ప్రైవేట్‌ పాఠశాలల్లో 25 శాతం విద్యార్థులకు ఈ చట్టాన్ని అమలు చేయాలి. ఆ పిల్లలకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ ప్రభుత్వం చెల్లించాలి. విద్యార్థుల హక్కుల రక్షణ కోసం బాలల హక్కుల కమీషన్‌ ఏర్పాటు చేయాలని విద్యా హక్కు చట్టం చెప్పింది. అయినా ఈ అంశంపై సర్కారు దృష్టి సారించలేదు. విద్యా హక్కు చట్టం పటిష్టంగా అమలు జరిగేందుకు పాఠశాల యాజమాన్యపు కమిటీలు వేయాలి. కాని అదీ నెరవేరలేదు.
విద్యారంగాన్ని ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తుంది
ఐ వెంకటేశ్వరరావు, యుటిఎఫ్‌ ప్రధాన కార్యదర్శి
విద్యా హక్కు చట్టంపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశంతోనైనా సర్కారు కదలాలి. ఇప్పటికే సుప్రీం కోర్టు చాలాసార్లు మొట్టికాయలు వేసింది. విద్యారంగాన్ని ప్రభుత్వ భ్రష్టు పట్టించింది. విద్యా హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి.